Sunday, 22 November 2020

సుమతి శతక పద్యాలు 51 - 60 | sumati shataka padyas 51 - 60

51.
కనకపు సింహాసనమున
శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునన్
వొనరగఁ బట్టముఁ గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ
!  - బద్దెన

భావం:- ఓ బుద్ధిమంతుడా! మంచి సుముహూర్తాన ఒక కుక్కను తీసుకువచ్చి బంగారు సింహాసనం మీద కూర్చోపెట్టి పట్టాభిషేకం చేస్తే అది తన స్వభావ సిద్ధ పాత గుణాన్ని మార్చుకుంటుందా?


52.
తలనుండు విషము ఫణికిన్
వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్
దలదోక యనకనుండును
ఖలునకు నిలువెల్ల విషముగదరా సుమతీ
!  - బద్దెన

భావం:- ఓ బుద్ధిమంతుడా! పాముకి దాని తలలో విషం ఉంటుంది, తేలుకి దాని తోకలో ఉంటుంది, కాని ఒక దుష్ట వ్యక్తికి విషం తల తోకల్లో అని కాకుండా శరీరమంతా వ్యాపించి ఉంటుంది. 


53.
కాదని యెవ్వరి తోడన్
వాదించక చూడ వెర్రి వానింబలెనే
భేదాభేదము దెలిపెడు
వేదాంత రహస్యమెల్ల వెదుకర సుమతీ
!  - బద్దెన

భావం:- ఓ బుద్ధిమంతుడా! ఎప్పుడూ ఇతరుల మాటలకు వ్యతిరేకంగా వాదించకూడదు. తెలివి తక్కువ వాడిగా కనిపిస్తూ వేదసారాన్ని అర్థం చేసుకోవటం నిజంగా గొప్ప వరం,దాని వల్లనే మనిషి ఆలోచన విధానం లో తేడా ని అర్థం చేసుకోగలవు.  


54.
తల మాసిన వొలు మాసిన
వలువలు మాసినను బ్రాణ వల్లభు నైనన్
కులకాంతలైన రోతురు
తిలకింపగ భూమిలోన దిరముగ సుమతీ
!  - బద్దెన

భావం:- ఓ బుద్ధిమంతుడా! ఈ ప్రపంచంలో ఒక పురుషుడు స్త్రీకి ఎంత ప్రియమైనప్పటికీ, అతని జుట్టు చెరిగి ఉండి, అతని శరీరం మరియు బట్టలు మురికిగా ఉంటే ఆమె అతన్ని అసహ్యించుకుంటుంది


55.
తాననుభవింప నర్థము
మానవపతిజేరు గొంత మఱి భూగతమౌ
గానల నీగలు గూర్చిన
తేనియ యోరుజేరునట్లు తిరముగ సుమతీ!  - బద్దెన

భావం:- ఓ బుద్ధిమంతుడా! ఎలా అయితే తేనెటీగలు సంపాదించిన తేనె వాటికి కాకుండా ఇతరులకు చెందుతుందో అదే విధంగా వ్యక్తి కూడా తాను సంపాదించింది అనుభవించకుండా మరణిస్తే అది రాజుకు మరియు భూమికి (ఒక వేళ భూమిలో దాచిపెడితే) చెందుతుంది.


56.
చింతింపకు కడచినపని
కింతులు వలతురని నమ్మకెంతయు మదిలో
నంతఃపుర కాంతలతో
మంతనములు మానుమిదియే మతముర సుమతీ!  - బద్దెన

భావం:- ఓ బుద్ధిమంతుడా! గడిచిపోయిన దాని గురించి బాధ పడకూడదు, స్త్రీలు మిమ్మల్ని ప్రేమిస్తారని మీ మనసులో అనుకోకూడదు, రాజభవనం లోని స్త్రీలతో ఏకాంతంగా రహస్య చర్చలు జరపకూడదు, ఇలా ప్రవర్తించటమే మంచిది


57.
ధనపతి సఖుడై యుండియు
నెనయంగా శివుడు భిక్షమెత్తగ వలసెన్
దనవారి కెంత గలిగిన
తనభాగ్యమె తనకు గాక తథ్యము సుమతీ
!  - బద్దెన

భావం:- ఓ బుద్ధిమంతుడా! ధనానికి అధిపతి ఐన కుబేరుడు శివుడికి మిత్రుడైనప్పటికీ, శివుడికి భిక్షమెత్తక తప్పలేదు. అదే విధంగా నీ బంధు మిత్రులకు ఎంత సంపద ఉన్నా అది నీకు చెందదు, నీది మాత్రమే నీకు చెందుతుంది.   


58.
తలపొడగు ధనము బోసిన
వెలయాలికి నిజములేదు వివరింపంగా
దలదడివి బాసజేసిన
వెలయాలిని నమ్మరాదు వినరా సుమతీ
!  - బద్దెన

భావం:- ఓ బుద్ధిమంతుడా! నువ్వు ఎంత డబ్బు ఇచ్చిన ఒక వేశ్య ఎప్పుడూ నిజం చెప్పదు,నీ మీద ఒట్టు పెట్టి ఆమె మాటలు చెప్పినా కూడా వాటిని నమ్మకు. 


59.
నడువకుమీ తెరువొక్కట
గుడువకుమీ శత్రునింట గూరిమితోడన్
ముడువకుమీ 
రధనములు
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ!  - బద్దెన

భావం:- ఓ బుద్ధిమంతుడా! రహదారిపై ఒంటరిగా వెళ్లవద్దు, శత్రువుల ఇంట్లో తినవద్దు. ఇతరుల డబ్బు దొంగిలించవద్దు,ఇతరులను బాధ పెట్టే విధంగా మాట్లాడవద్దు.


60.
నమ్మకు సుంకరి జూదరి,
నమ్మకు మగసాలివాని, నటువెలయాలిన్
నమ్మకు మంగడివాడిని
నమ్మకుమీ వామహస్తు నవనిని సుమతీ
!  - బద్దెన

భావం:- ఓ బుద్ధిమంతుడా! ఈ ప్రపంచంలో, పన్ను వసూలు చేసేవాడు, జూదగాడు, స్వర్ణకారుడు, నటుడు, వేశ్య, ఎడమ చేతి వాటం ఉన్న దుకాణదారుణ్ని నమ్మకు.

No comments:

Post a Comment