Sunday, 22 November 2020

సుమతి శతక పద్యాలు 41 - 50 | sumati shataka padyas 41 - 50

41.
దగ్గర కొండెము చెప్పెడు
ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుడై మరి తా
నెగ్గు బ్రజ కాచరించుట
బొగ్గులకై కల్పతరువు బొడుచుట సుమతీ
!  - బద్దెన

భావం:- ఓ బుద్ధిమంతుడా! ప్రజలపై మంత్రి ఫిర్యాదులను విని, రాజు వారిని శిక్షించటం, బొగ్గు కోసం కల్ప వృక్షమును నరకటం లాంటిది.  


42.
చుట్టములు గాని వారలు
చుట్టములము నీకటంచు సొంపుదలిర్పన్
నెట్టుకొని యాశ్రయింతురు
గట్టన ద్రవ్యంబు గలుగ గదరా సుమతీ
!  - బద్దెన

భావం:- ఓ బుద్ధిమంతుడా! నీ దగ్గర సంపద ఉన్నప్పుడు, ఎదో ఒక సంబంధం పెట్టుకొని బంధువులు కానీ వారు కూడా బంధువులమంటూ నీ దగ్గరకి వస్తారు.


43.
కాదన్న వాడే కరణము
వాదడచిన వాడే పెద్ది వసుధేశు కడన్
లేదన్నవాడే చనవరి
గాధలు పెక్కాడు వాడే కావ్యుడు సుమతీ
!  - బద్దెన

భావం:- ఓ బుద్ధిమంతుడా! ఒక కరణము ఇతరులను విభేధించగలడు,గ్రామ పెద్ద ఒక్కడే సమస్యలని పరిష్కరించగలుగుతాడు ,స్వలాభం కోసం వచ్చిన వారిని లోపలికి అనుమతించని ద్వారపాలకుడు రాజుకు శ్రేయోభిలాషి మరియు గొప్ప కథలు చెప్పే వాడే నిజమైన కవి.


44.
చేతులకు తొడవు దానము
భూతలనాథులకుదొడవు బొంకమి, ధరలో
నీతియె తొడ వెవ్వారికి
నాతికి మానంబు తొడవు, నయముగ సుమతీ
!  - బద్దెన

భావం:- ఓ బుద్ధిమంతుడా! ఉదారంగా ఇవ్వడం చేతులకు ఒక అలంకారం, అబద్ధాలు చెప్పకపోవడం రాజులకు అలంకారం, నైతికత అందరికీ అలంకారం మరియు మహిళలకు గౌరవం అలంకారం.


45.
తడవోర్వక యోడలోర్వక
కడువేగం బడిచిపడిన గార్యంబగునే
నీతి తోడ వెవ్వారికి
జెడిపోయిన కార్యంబెల్ల జేకురు సుమతీ
!  - బద్దెన

భావం:- ఓ బుద్ధిమంతుడా! ముందు వెనుక ఆలోచించకుండా అన్ని పనులు త్వరత్వరగా చేస్తే అవి పూర్తి అవుతాయా? పూర్తి శ్రద్ధతో పని చేస్తే ఆలస్యమైనప్పటికీ ఇంతకుముందు పూర్తి చేయని పనులని సైతం పూర్తి చేయవచ్చు. 


46.
తనకోపమే తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ
తన సంతోషమే స్వర్గము
తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతీ
!  - బద్దెన

భావం:- ఓ బుద్ధిమంతుడా! నీ కోపమే నీ శత్రువు, నీ శాంత చిత్తమే నీకు రక్షణ, నీ దయా గుణమే నీకు చుట్టము వంటిది, సంతోషంగా ఉండటమే స్వర్గం , బాధనే నరకం, ఇదే నిజం. 


47.
తనయూరి తపసితనమును
దనబుత్రుని విద్యపెంపు దన సతి రూపున్
తన పెరటి చెట్టు మందును
మనసున వర్ణింపరెట్టి మనుజులు సుమతీ
!  - బద్దెన

భావం:- ఓ బుద్ధిమంతుడా! ఈ మనుషులు సొంత ఊరి వ్యక్తి చేసే తపస్సు. కొడుకు యొక్క ఉన్నత చదువు.  భార్య అందచందాలు, పెరటి చెట్టు ఔషధగుణము మొదలైన వాటిని ఎప్పుడు గొప్పగా భావించరు. 


48.
తన కలిమి ఇంద్రభోగము
తనలేమియె సర్వలోక దారిద్ర్యంబున్
తన చావు జగత్ప్రళయము
తను వలచిన యదియెరంభ తథ్యము సుమతీ
!  - బద్దెన

భావం:- ఓ బుద్ధిమంతుడా! కొంతమంది తమ సంపద ఇంద్రుడి సంపదతో సమానమని, వారి పేదరికం ప్రపంచ పేదరికంతో సమానం అని, వారి మరణం ప్రపంచానికి ప్రళయం అని, వారు ప్రేమించే స్త్రీ ప్రపంచంలోనే అత్యంత అందమైనది అన్న భ్రమలో ఉంటారు.


49.
తన వారు లేని చోటను
జనవించుక లేనిచోట జగడము చోటన్
అనుమానమైన చోటను
మనుజున కట నిలువదగదు మహిలో సుమతీ
!  - బద్దెన

భావం:- ఓ బుద్ధిమంతుడా! ఈ ప్రపంచంలో, బంధువులు లేని చోట, మనకు సౌకర్యంగా అనిపించిన చోట, గొడవలు జరిగే సంభావ్యత ఉన్న చోట మరియు మనల్ని అనుమానిస్తున్న చోట మనం ఉండకూడదు. 


50.
తమలము వేయని నోరును
విమతులతో జెలిమి జేసి వెతఁబడు తెలివిన్
గమలములు లేని కొలనుకును
హిమదాముడు లేని రాత్రి హీనము సుమతీ
!  - బద్దెన

భావం:- ఓ బుద్ధిమంతుడా! తమలపాకును నమలని నోరు, అందమైన స్త్రీ చనుమొనలని తాకని మగవాడి శరీరం, తామర పువ్వులు లేని కొలను, చంద్రుడు లేని రాత్రి, ఇవన్నీ పనికిరానివి.



No comments:

Post a Comment